2 లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్
కామారెడ్డి జిల్లా: బిచ్కుంద ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ దీను సత్యనారాయణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. శుక్రవారం (ఏప్రిల్ 17) బిచ్కుందలోని తన అద్దె ఇంట్లో ఓ వ్యక్తి నుంచి రూ. 2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
కల్లు దుకాణాలను వేరే చోటకు మార్చాలని ఒత్తిడి చేయకుండా ఉండేందుకు, ఆ దుకాణాలపై భవిష్యత్తులో ఎలాంటి అక్రమ కేసులు నమోదు చేయకుండా వ్యాపారం చేసుకోనిచ్చేందుకు ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ ఈ భారీ లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పక్కా ప్రణాళికతో వల పన్నిన ఏసీబీ అధికారులు.. ఆయన లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇదే సమయంలో, ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ బ్యాగ్‌లో ఎలాంటి లెక్కలు లేని మరో రూ. 45,760 నగదును కూడా అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
తన అధికారిక విధులను దుర్వినియోగం చేస్తూ లంచం తీసుకున్న ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. నిందితుడిని హైదరాబాద్, నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు (II Additional Special Judge) ముందు హాజరుపరుస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు గానీ, వాట్సాప్ నంబర్ 9440446106 కు గానీ ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు.