92 ఏళ్ల వయసులోనూ తగ్గేదే లే అంటున్న లేడీ డాక్టర్..

Published on: 24 Jul 2026, 04:41 PM
News Article

హైదరాబాద్, జూలై 24, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): సరిగ్గా నడవడానికే నానా అవస్థలు పడే 90 ఏళ్ల వయసులో, ఆమె మాత్రం ఇటు స్టెతస్కోప్, అటు సర్జికల్ బ్లేడ్ పట్టుకుని ఇప్పటికీ రోగులకు వైద్యం అందిస్తున్నారు. అక్షరాలా 68 సంవత్సరాలకు పైగా అనుభవంతో వైద్య రంగంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు హైదరాబాద్‌కు చెందిన 92 ఏళ్ల డాక్టర్ సూరి శ్రీమతి. 1958లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆమె, ప్రభుత్వ వైద్యురాలిగా గాంధీ, నీలోఫర్, ఉస్మానియా వంటి ప్రముఖ ఆసుపత్రుల్లో సేవలు అందించి రిటైరయ్యారు.

నేటికీ ఉదయాన్నే యోగా, ప్రాణాయామం చేస్తూ ఏమాత్రం చేతులు వణకకుండా, సొంతంగా కారు డ్రైవ్ చేసుకుంటూ ఆసుపత్రికి వెళ్తుండటం విశేషం. కేవలం ఓపీ చూడటమే కాకుండా, ఇప్పటికీ అవసరమైనప్పుడు సిజేరియన్ (C-Section) ఆపరేషన్లు కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మూడు తరాల మహిళలకు వైద్యం అందించిన అనుభవం ఆమె సొంతం. కేవలం 300 రూపాయల ఓపీ ఫీజు తీసుకుంటూ, పేదల వద్ద అసలు తీసుకోకుండా మానవత్వాన్ని చాటుకుంటున్న డాక్టర్ శ్రీమతి.. తన చురుకైన జీవనశైలి, అంకితభావంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.