అక్రమార్కులకు అడ్డాగా 'భూ భారతి'..

Published on: 05 May 2026, 04:52 AM
News Article

హైదరాబాద్ న్యూస్ టైమ్ | మే 05, 2026 హైదరాబాద్: రియల్ ఎస్టేట్ మోసాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. నమ్మకంగా ఉంటూనే నకిలీ రిజిస్ట్రేషన్లతో ఓ వ్యాపారవేత్తను నిలువునా ముంచిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. రాయదుర్గంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే వ్యాపారవేత్త, అదే అపార్ట్‌మెంట్‌లో తన మరో ఫ్లాటును దివాకర్ బాబు పర్వతనేని అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చాడు. ఈ పరిచయంతో దివాకర్ బాబు, అతని సోదరి ఉష కలిసి వ్యాపారవేత్తను బుట్టలో వేశారు. మత్తంగి సమీపంలో తమకు 1.19 గుంటల భూమి ఉందని, తక్కువ ధరకే అమ్ముతామని నమ్మించి అతని వద్ద నుండి రెండు విడతల్లో రూ.2.15 కోట్లు వసూలు చేశారు.

అనంతరం కంది రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తీసుకెళ్లి, ఒక గుర్తు తెలియని వ్యక్తితో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగినట్లు నాటకమాడి బాధితుడిని నమ్మించారు. అంతటితో ఆగకుండా, నిజాంపేటలో ఉన్న బాధితుడి విల్లాను కూడా అమ్మిపెడతామని పత్రాలు తీసుకుని, సంతకాలు ఫోర్జరీ చేసి లింగారెడ్డి అనే వ్యక్తికి సేల్ అగ్రిమెంట్ చేశారు. ఇటీవల లింగారెడ్డి ఆ విల్లాను స్వాధీనం చేసుకోవడానికి రావడంతో బాధితుడు షాక్‌కు గురయ్యాడు. వెంటనే కంది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విచారించగా, అసలు తన పేరిట ఎలాంటి భూమి రిజిస్ట్రేషన్ కాలేదని తెలిసి లబోదిబోమన్నాడు. తాను దారుణంగా మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, ఈఓడబ్యూ (EOW) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.