అడ్వకేట్లందరికీ ఆరోగ్య బీమా కల్పించాలి

Published on: 03 May 2026, 08:55 AM
News Article

హైదరాబాద్ న్యూస్, మే 3 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులందరికీ తక్షణమే ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేయాలని తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆదివారం సంఘం ప్రతినిధులు న్యాయ కార్యదర్శి పాపిరెడ్డిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా 2019 తర్వాత వృత్తిలోకి ప్రవేశించి, ప్రస్తుతం ఎటువంటి బీమా రక్షణ లేని వారందరినీ ఈ పథకంలో చేర్చాలని వారు విజ్ఞప్తి చేశారు.

న్యాయ వ్యవస్థలో కీలకమైన న్యాయవాదులకు ఆరోగ్య భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ముఖ్యంగా జూనియర్ న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రత్యేక 'స్టైఫండ్' ప్రవేశపెట్టాలని సంఘం నేతలు కోరారు. అలాగే హైకోర్టు అసోసియేషన్‌కు రావాల్సిన పెండింగ్ గ్రాంట్లను వెంటనే విడుదల చేయాలని అభ్యర్థించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి న్యాయవాదుల సంక్షేమానికి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు డి.ఎల్. పాండు, కార్యదర్శులు పి. శ్రవణ్ కుమార్ గౌడ్, నిరంజన్ రెడ్డి తదితరులు ఉన్నారు.