అత్తింటివారి వేధింపులు భ‌రించ‌లేక వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌

Published on: 22 May 2026, 03:51 AM
News Article

హైదరాబాద్ న్యూస్ టైమ్, నల్గొండ, మే 22: అత్తమామలు, కట్టుకున్న భార్య పెట్టిన మానసిక, శారీరక వేధింపులు భరించలేక ఓ యువకుడు పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్న దారుణ ఉదంతం చండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుల్లెమ్లా గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక వివరాల ప్రకారం.. పుల్లెమ్లా గ్రామానికి చెందిన మల్లేష్, తన సొంత మేనమామ శ్రీనివాస్ కూతురైన కల్పనను వివాహం చేసుకున్నాడు. అయితే, గత తొమ్మిది సంవత్సరాలుగా కల్పన మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుని, ఇద్దరు పిల్లలతో కలిసి హయత్ నగర్‌లోని తన పుట్టింట్లోనే ఉంటోంది. ఈ విషయమై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీలు పెట్టినప్పటికీ.. అత్తమామలు శ్రీనివాస్, రాజేశ్వరి సద్దుమణిగకపోగా, మల్లేష్ కుటుంబంపైనే దాడులకు తెగబడ్డారు. కనీసం కన్నపిల్లలను కూడా చూడనీయకుండా దూరం పెట్టడంతో మనస్థాపం చెందిన మల్లేష్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఈనెల 1వ తేదీన తన పిల్లలను చూడటానికి వెళ్లిన మల్లేష్‌పై మామ శ్రీనివాస్ మళ్లీ దాడి చేయడంతో, తీవ్ర అవమాన భారంతో తన సొంత ఊరి వ్యవసాయ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సొంత అల్లుడి మరణానికి కారణమైన మామ శ్రీనివాస్, అత్త రాజేశ్వరి, భార్య కల్పనలపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లిదండ్రులు, పుల్లెమ్లా గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు చండూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.