అదరగొడుతున్న 'ఆధార్' యాప్.. జస్ట్ ఐదు నెలల్లో 3.1 కోట్ల మంది ఫోన్లలోకి!

Published on: 23 Jun 2026, 11:45 AM
News Article

న్యూఢిల్లీ, జూన్ 23 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన కొత్త 'ఆధార్' (Aadhaar) మొబైల్ యాప్ డౌన్‌లోడ్‌ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ యాప్‌ను ప్రారంభించిన కేవలం ఐదు నెలల వ్యవధిలోనే ఏకంగా 3.1 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవడం విశేషం. ఆధార్ కార్డుకు సంబంధించిన సేవలను మరింత సులభతరం చేస్తూ తీసుకొచ్చిన ఈ యాప్ ద్వారా ఇప్పటికే 40 లక్షల మంది వినియోగదారులు విజయవంతంగా తమ మొబైల్ నంబర్లను అప్‌డేట్ చేసుకోగా.. మరో 8.5 లక్షల మంది యాప్ సాయంతో తమ నివాస చిరునామాలను సైతం మార్చుకున్నారు. మీసేవ, ఆధార్ కేంద్రాల చుట్టూ తిరిగే పనిలేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంట్లో నుంచే తమ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకునే వెసులుబాటు ఉండటంతో ప్రజల నుంచి ఈ యాప్‌కు విశేష స్పందన లభిస్తోందని అధికారులు వెల్లడించారు.