అనారోగ్యంతో బాధపడుతున్న నేతలకు మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆర్థిక సాయం!
హైదరాబాద్, జూన్ 17 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా. గాదరి కిశోర్ కుమార్ బుధవారం హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అనారోగ్యంతో బాధపడుతున్న నాయకులను, మృతుల కుటుంబాలను పరామర్శించారు. కొత్తపేటలో ఇటీవల అనారోగ్యం నుండి కోలుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న తన మిత్రుడు మదన్ తండ్రిని కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎల్బీనగర్‌లోని పవన్ సాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నూతనకల్ మండల బిఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు ఎడ్ల శ్రీనును పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరుతూ వారికి రూ. 20,000 ఆర్థిక సాయం అందజేశారు. అదేవిధంగా, అడ్డగూడూరు మండలం డి. రేపాక గ్రామంలో ఇటీవల మరణించిన బిఆర్ఎస్ నాయకుడు చిర్రబోయిన రామచంద్రు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ. 10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ పరామర్శల కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మరియు బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.