హైదరాబాద్, నవంబర్ 21, 2026 (హైదరాబాద్ న్యూస్టైమ్): ఉన్నత చదువులు పూర్తి చేసి, ఉద్యోగంలో చేరిన వారం రోజులకే అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లా మునుగోడు పట్టణానికి చెందిన సాయితేజ (25) మృతి చెందాడు. అమెరికా రహదారిపై కారులో ప్రయాణిస్తుండగా ఆకస్మికంగా జింక అడ్డం రావడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
మునుగోడు పట్టణానికి చెందిన సాయితేజ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. చదువు పూర్తయిన తర్వాత ఇటీవలే వారం రోజుల క్రితం అక్కడ ఉద్యోగం సాధించి, తల్లిదండ్రులకు సంతోషంగా ఆ విషయాన్ని తెలియజేశాడు. అయితే, సాయితేజ కారులో వెళ్తుండగా ఒక్కసారిగా ఓ జింక రోడ్డుకు అడ్డం రావడంతో దానిని ఢీకొట్టి అతని కారు నిలిచిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఇతర వాహనాలు సాయితేజ కారును బలంగా ఢీకొట్టాయి.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయితేజను స్థానిక అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. వారం రోజుల క్రితమే ఉద్యోగం వచ్చిందని ఆనందం వ్యక్తం చేసిన కుమారుడు, ఇంతలోనే విగతజీవిగా మారడంతో మునుగోడులోని అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.