అమ్మా, నాన్నా నన్ను క్షమించండి.. కన్నీళ్లు పెట్టుకుంటూ భోరున ఏడ్చిన కొండా సుష్మిత

Published on: 05 Sep 2026, 04:32 PM
News Article

హైదరాబాద్, సెప్టెంబర్ 5, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): మంత్రివర్గం నుంచి తన తల్లి కొండా సురేఖ బర్తరఫ్ కావడంపై ఆమె కూతురు కొండా సుష్మిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ముందుకు వచ్చిన ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ భోరున విలపించారు. "అమ్మా, నాన్నా నన్ను క్షమించండి" అంటూ ఆవేదన వ్యక్తం చేసిన సుష్మిత.. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీలో నేనైనా ఉండాలి, ఆమె అయినా ఉండాలి అనే స్థాయికి ఒక ముఖ్యమంత్రి దిగజారుతాడా అని ఆమె నిలదీశారు. తాను మాట్లాడిన మాటల్లో ఎలాంటి తప్పులేదని, ఒకవేళ తప్పు ఉన్నా తనపై చర్యలు తీసుకోవాలి తప్ప సామాన్య కార్యకర్త నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన మహిళపై సీఎం ఇంత కక్ష పెట్టుకోవడం తగదని సుష్మిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మా అమ్మ చేసిన ఒక్క తప్పు చూపించాలని, ఆమె శాఖలో కనీసం చిన్న అవినీతి కూడా జరగలేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కోసం ప్రయత్నిస్తున్న తన తండ్రి రేవంత్ రెడ్డిని ఎందుకు తిట్టిస్తారని ప్రశ్నించారు. అధిష్టానం మొత్తం తమ వైపే ఉందని, కానీ రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్ చేయడం వల్లే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సోదరుల అక్రమాల చిట్టా తన వద్ద ఉందని, దాని గురించి త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. తాము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని, కానీ ముందస్తుగా అమ్మను ఇంత అవమానిస్తారని తెలిస్తే తాను ఆ మాటలు మాట్లాడేదాన్ని కాదని సుష్మిత కంటతడి పెట్టారు.