“అవును.. ఆ స్కూల్‌ను నేనే కూల్చేయించా!”..
హైదరాబాద్, జూన్ 27 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): రాజధాని నగరంలో చెరువుల పరిరక్షణ, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ కూల్చివేతల పర్వం తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్న వేళ.. ‘ది బంబిని క్రీక్ స్కూల్’ (The Bambini Creek School) భవనం కూల్చివేతపై రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పాఠశాల భవనాన్ని తానే స్వయంగా అధికారులకు ఫిర్యాదు చేసి కూల్చేయించానని బహిరంగంగా ప్రకటించి అధికార, రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా అగ్గి రాజేశారు.
రేవంత్ రెడ్డి నిర్ణయంతోనే బఫర్ జోన్‌లోకి: ఈ కూల్చివేతపై బొర్రా జ్ఞానేశ్వర్ స్పందిస్తూ.. "ది బంబిని క్రీక్ స్కూల్ భవనం గతంలో ఎలాంటి బఫర్ జోన్ పరిధిలో లేదు. కానీ, ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న సరికొత్త, కఠినమైన నిర్ణయాల వల్లే ఆ స్కూల్ భవనం ఇప్పుడు బఫర్ జోన్ పరిధిలోకి వచ్చింది. నిబంధనల ప్రకారం చెరువుల పరిరక్షణ ఏరియాలోకి వచ్చినందుకే.. ఆ భవనాన్ని తక్షణమే కూల్చివేయాలని నేను అధికారులకు పక్కా ఆధారాలతో ఫిర్యాదు చేశాను" అని స్పష్టం చేశారు. సీఎం తీసుకున్న తాజా నిబంధనల ప్రకారమే ఈ యాక్షన్ జరిగిందని ఆయన ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇవ్వడంతో.. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌లో మరిన్ని విద్యాసంస్థలు, ప్రైవేట్ భవనాల కూల్చివేతలకు ఈ వ్యవహారం లైన్ క్లియర్ చేసినట్లయిందనే చర్చ జోరుగా నడుస్తోంది.