ఆ ఫోటోల వెనుక అసలు నిజం ఇదే.. మైక్రో స్కామ్‌పై క్లారిటీ ఇచ్చిన మంగ్లీ బ్రదర్!
హైదరాబాద్ న్యూస్‌టైమ్ (క్రైమ్ & ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్): ప్రముఖ సింగర్ మంగ్లీపై గత 30 రోజులుగా వస్తున్న ఆరోపణల వ్యవహారంపై ఆమె తమ్ముడు శివ చౌహాన్ స్పందించారు. బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తమపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని, మైక్రో ఫైనాన్స్ స్కామ్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
ఫోటోల వెనుక అసలు కథ ఇదే..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోల వెనుక ఎలాంటి తప్పు లేదని శివ స్పష్టం చేశారు.
- పరిచయం ఇలా: మధు రమావత్, హేమాకాంత్ రెడ్డి అనే వ్యక్తులు 'తీజ్ పండుగ' కోసం మాట్లాడటానికి రాగా, మంగ్లీ తన నెంబర్ ఇచ్చి మాట్లాడమన్నారని తెలిపారు.
- ఫోటోలు ఎలా వచ్చాయంటే?: ఒక వెంచర్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి మంగ్లీని ఆహ్వానించగా.. ఆమె ఇలాంటి కార్యక్రమాలకు రానని చెప్పారన్నారు. దీంతో జూన్ 9న తాను ఆ కార్యక్రమానికి వెళ్లినప్పుడు ఆ ఫోటోలు దిగామని చెప్పారు. అలాగే జూన్ 10న మంగ్లీ బర్త్‌డే ఏర్పాట్లలో ఉన్నప్పుడు తనతో ఉన్న డ్రైవర్లు మరికొన్ని ఫోటోలు తీశారని, వాటినే ఇప్పుడు డబ్బులు తీసుకున్నట్లుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
- రియల్ ఎస్టేట్ డీల్: రియల్ ఎస్టేట్ ఆఫీస్ కోసం వారు అడగటంతో తన ప్లాట్ చూపించానని, దానికి వారు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్న తర్వాతే వారితో పరిచయం పెరిగిందని క్లారిటీ ఇచ్చారు.
స్కామ్‌తో సంబంధం లేదు.. దేవుడి మీద ఒట్టు!
మైక్రో ఫైనాన్స్ స్కామ్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని తాను నమ్మే హనుమాన్, సేవాలాల్ సాక్షిగా శివ చౌహాన్ ప్రమాణం చేశారు.
- ఈ స్కామ్‌కు సంబంధించి నమోదైన 60 నుంచి 90 కేసుల్లో ఎక్కడా తమ పేర్లు లేవని, కనీసం బాధితులు కూడా తమ పేర్లను ఎక్కడా ప్రస్తావించలేదన్నారు.
- అడ్వకేట్ సుబ్బారావు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, ఆయన కోర్టులో పోరాడకుండా మీడియా ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎవరినీ బెదిరించలేదని, కనీసం కాల్ లేదా మెసేజ్ కూడా చేయలేదన్నారు.
న్యాయ పోరాటం చేస్తాం!
14 సంవత్సరాలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, ఎంతో కష్టపడి పైకొచ్చిన తమ కుటుంబంపై కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారని శివ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదం వల్ల తమ కుటుంబ పరువుకు భంగం వాటిల్లిందని వాపోయారు. పోలీసుల నుండి క్లీన్ చిట్ వచ్చిన తర్వాత తమపై బురద చల్లిన వారిపై న్యాయస్థానం ద్వారా లీగల్ గా పోరాటం చేస్తామని హెచ్చరించారు. బాధితుల పక్షాన కూడా తాము నిలబడతామని, వాస్తవాలు చట్టం ముందు త్వరలోనే నిరూపితమవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.