ఆందోోల్ మైసమ్మ దేవాలయంలో ఘనంగా బోనాల ఉత్సవాలు

Published on: 02 Aug 2026, 02:34 PM
News Article

హైదరాబాద్, ఆగస్ట్ 2, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ప్రసిద్ధ ఆందోల్ మైసమ్మ దేవస్థానంలో అమ్మవారి 21వ వార్షిక బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి చండీ హోమం నిర్వహించడంతో పాటు, శ్రీ ఆందోల్ మైసమ్మ తల్లి, ఉప్పలమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి ఉత్సవ విగ్రహాలతో గ్రామ సేవ రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా దేవస్థానం చైర్మన్ కంచర్ల అశ్విని రెడ్డి, కార్యనిర్వాహణాధికారి సల్వాది మోహన్ బాబు అమ్మవారికి తొలి సర్కార్ బోనం, నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండటంతో ఈ ఉత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానికి విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం దాత కొమిరిశెట్టి విజయ్ కుమార్ - శిరీష దంపతులు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చౌటుప్పల్ ట్రాఫిక్ సీఐ నందగిరి వెంకటేష్ ఆధ్వర్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టి, భక్తులు క్యూలైన్ల ద్వారా క్రమపద్ధతిలో అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గీట్కాటి నిరంజన్, మాజీ సర్పంచ్ పబ్బు రాజు గౌడ్, చౌటుప్పల్ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, ధర్మకర్తల మండలి సభ్యులు ఈడుదుల బాబు, బేతాళ నరసింహ, సిద్దిపేట ఆనందరెడ్డి, వెంకిర్యాల శివ, బాలగోని శ్రీకాంత్ గౌడ్, బొంతల యువరాజ్, మన్నే మహేందర్ రెడ్డి, దౌడీ రాజేష్ పన్నాల, మహేందర్ రెడ్డి, ధేప రాజీవ, పంతంగి రమేష్, జొన్నగంటి దాసు, చిట్టెంపల్లి సబిత, వల్లూరి శివప్రసాద్ శర్మతో పాటు పలువురు గ్రామ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.