ఆకాశంలో మాయా యుద్ధనౌక..

Published on: 17 Mar 2026, 01:33 PM
News Article
చైనా రక్షణ రంగంలో సరికొత్త సంచలనం 'లువాన్ నియావో'. ఇది సముద్రంలో ప్రయాణించే యుద్ధనౌక కాదు.. ఏకంగా ఆకాశంలో, భూమికి అతి సమీప అంతరిక్షం (Near-space)లో తిరుగుతూ శత్రువులపై విరుచుకుపడే 'ఫ్లయింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్'. చైనాకు చెందిన 'నాంతియాన్‌మెన్ ప్రాజెక్ట్' (Nantianmen Project)లో భాగంగా దీనిని రూపొందిస్తున్నారు.

ఈ భారీ యుద్ధనౌక ప్రత్యేకతలు ఇవే:

కొండంత పరిమాణం: దీని బరువు అక్షరాలా 1,20,000 టన్నులు. పొడవు 242 మీటర్లు, వెడల్పు 684 మీటర్లు. దీని భారీ పరిమాణం కారణంగానే దీనిని 'ఆకాశంలో ఎగిరే విమాన వాహక నౌక' అని పిలుస్తున్నారు.

88 డ్రోన్ల సైన్యం: ఈ నౌక తనలో 88 'క్వాన్ ను' (Xuan Nu) అనే స్టీల్త్ డ్రోన్లను మోసుకెళ్తుంది. ఇవి శత్రువుల కంటపడకుండా హైపర్ సోనిక్ క్షిపణులతో దాడులు చేయగలవు.

క్షిపణులకు చిక్కదు: సాధారణ యుద్ధ విమానాల కంటే చాలా ఎత్తులో, వాతావరణ మార్పులకు అతీతంగా ఇది ప్రయాణిస్తుంది. ప్రస్తుతం ఉన్న సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణులు (SAM) దీనిని చేరుకోవడం దాదాపు అసాధ్యం.

శక్తివంతమైన ఆయుధాలు: ఇందులో పార్టికల్ యాక్సిలరేషన్ కానన్లు (Particle acceleration cannons), హైపర్ సోనిక్ క్షిపణులు అమర్చాలని చైనా యోచిస్తోంది.

సైన్స్ ఫిక్షన్ లాంటి టెక్నాలజీ: దీనిని గాలిలో నిలబెట్టడానికి అవసరమైన శక్తిని అందించేందుకు వేలాది శక్తివంతమైన ఇంజన్లు అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోయినా, రాబోయే 20-30 ఏళ్ల కాలపరిమితితో దీనిని సిద్ధం చేస్తున్నారు.

అయితే ఇది నిజమా? లేక ప్రచారమా?
కొందరు రక్షణ రంగ నిపుణులు దీనిని కేవలం చైనా చేస్తున్న 'ప్రచార యుద్ధం' (Propaganda)గా అభివర్ణిస్తున్నారు. ఇంతటి భారీ నౌకను గాలిలో నిలబెట్టడం భౌతిక శాస్త్ర పరంగా ప్రస్తుతానికి సవాలేనని అంటున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రాజెక్ట్‌పై ప్రజల్లో ఆసక్తి పెంచేందుకు చైనాలోని షాంఘైలో 2027 నాటికి ఒక ప్రత్యేక థీమ్ పార్కును కూడా ఏర్పాటు చేస్తున్నారు.