ఆదర్శవంతమైన సేవలతో రిటైరైన ట్రాఫిక్ ఏఎస్‌ఐ కాట్రగడ్డ శ్రీనివాస్
హైదరాబాద్ న్యూస్‌టైమ్ (యాదాద్రి భువనగిరి జిల్లా): పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం పాటు నిబద్ధతతో పనిచేసి శాఖకు వన్నె తెచ్చిన చౌటుప్పల్ ట్రాఫిక్ ఏఎస్‌ఐ కాట్రగడ్డ శ్రీనివాస్ సేవలు మరువలేనివని ట్రాఫిక్ డీఎస్పీ ప్రభాకర్ రెడ్డి కొనియాడారు. చౌటుప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కాట్రగడ్డ శ్రీనివాస్ పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన వీడ్కోలు సమావేశానికి డీఎస్పీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తోటి పోలీసులు, సిబ్బంది, మిత్రులు మరియు కుటుంబ సభ్యులు శ్రీనివాస్‌ను శాలువాలు, పూలమాలలు మరియు జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీనివాస్ తన విధి నిర్వహణలో అత్యంత క్రమశిక్షణ, అంకితభావం ప్రదర్శించి ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారని ప్రశంసించారు. ఆయన సేవలను పోలీస్ సిబ్బంది అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. శ్రీనివాస్ తన శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ వీడ్కోలు సమావేశంలో తన వృత్తి జీవితంలో తనకు సహకరించిన ఉన్నతాధికారులకు, తోటి సిబ్బందికి కాట్రగడ్డ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ నందగిరి వెంకటేశం, ఎస్సైలు సైదిరెడ్డి, ఆంజనేయులు మరియు పలువురు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొని శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.