ఆపదలో ఉన్న కుటుంబానికి 'ఆపద్బాంధవుడు'.. చలమల్ల కృష్ణారెడ్డి
హైదరాబాద్, జూన్ 26 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆర్థికంగా సర్వస్వం కోల్పోయిన ఒక నిరుపేద కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి కొండంత అండగా నిలిచారు. మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం కొండాపురం గ్రామానికి చెందిన దుబ్బాక వెంకన్న 2022 జూన్ 1న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దీర్ఘకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. వైద్య ఖర్చుల కోసం తనకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిని సైతం విక్రయించాల్సి వచ్చింది. అయినప్పటికీ చికిత్స ఆగకపోవడంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది.
సీఎంఆర్ఎఫ్ ద్వారా లక్షల సాయం – చదువులకూ భరోసా: ఈ దయనీయ స్థితి గురించి తెలుసుకున్న చలమల్ల కృష్ణారెడ్డి వెంటనే స్పందించారు. బాధిత కుటుంబ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా రూ.1,75,000 (లక్షా డెబ్బై ఐదు వేలు) ఆర్థిక సహాయం మంజూరయ్యేలా ప్రత్యేక కృషి చేశారు. అనంతరం చలమల్ల కృష్ణారెడ్డి స్వయంగా వెంకన్నను పరామర్శించి, వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన చెక్కును అందజేశారు. అంతటితో ఆగకుండా, భవిష్యత్తులో ఆ కుటుంబానికి ఎలాంటి అవసరం వచ్చినా.. ముఖ్యంగా పిల్లల చదువుల బాధ్యతకు సంబంధించి ఏ సాయం కావాలన్నా తనను సంప్రదించవచ్చని, తానున్నానంటూ కొండంత నమ్మకాన్ని ఇచ్చారు. కృష్ణారెడ్డి చూపిన ఈ ఉదారతపై స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.