ఆఫ్రికాను ముంచెత్తుతున్న భారతీయ డ్రగ్స్.. 'ఏఎఫ్‌పీ' పరిశోధనలో షాకింగ్ నిజాలు!

Published on: 14 May 2026, 04:24 AM
News Article
  • నిషేధం ఉన్నా ఆగని మత్తు బిళ్లల అక్రమ రవాణా
  • రూ. 1,220 కోట్ల ఎగుమతులు
  • పశ్చిమ ఆఫ్రికాలో 'జోంబీ' డ్రగ్ విలయం..
  • భారత ఫార్మా కంపెనీల తీరుపై అంతర్జాతీయ ఆందోళన

హైదరాబాద్ న్యూస్ టైమ్, అమరావతి/న్యూఢిల్లీ: భారతీయ ఫార్మా కంపెనీల నుంచి పశ్చిమ ఆఫ్రికా దేశాలకు భారీ ఎత్తున 'టపెంటడాల్' వంటి శక్తివంతమైన ఓపియాయిడ్ (మత్తు) బిళ్లలు అక్రమంగా తరలుతున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ ఏఎఫ్‌పీ (AFP) తన దర్యాప్తులో సంచలన విషయాలను వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఈ ప్రమాదకర డ్రగ్స్ ఎగుమతులపై కఠిన ఆంక్షలు విధించినప్పటికీ, నిబంధనల్లోని లోపాలను ఆసరాగా చేసుకుని సుమారు 60కి పైగా కంపెనీలు రూ. 1,220 కోట్ల విలువైన స్టాక్‌ను సియెర్రా లియోన్, ఘనా, బెనిన్ వంటి దేశాలకు తరలిస్తున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. మార్ఫిన్ కంటే ఐదు రెట్లు ఎక్కువ శక్తివంతమైన ఈ మాత్రలను స్థానికంగా ఇతర రసాయనాలతో కలిపి 'కుష్' వంటి ప్రాణాంతక వీధి మత్తు పదార్థాలుగా మారుస్తుండటంతో, అక్కడ యువత మత్తుకు బానిసలై 'జోంబీ'ల్లా మారుతున్న దృశ్యాలు హృదయవిదారకంగా మారుతున్నాయి. భారత డ్రగ్స్ కంట్రోల్ జనరల్ (DCGI) 2025లోనే వీటిపై నిషేధం విధించినా, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపం వల్ల అంతర్జాతీయంగా భారత ఫార్మా రంగ ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఉందని, తక్షణమే ప్రభుత్వం ఈ అక్రమ రవాణా నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం మోపాలని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.