ఇకపై అందరికీ ఆధార్ రాదా?

Published on: 12 Apr 2026, 12:32 PM
News Article

న్యూఢిల్లీ: దేశంలో ఆధార్ కార్డుల జారీ ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. ప్రముఖ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ఈ పిటిషన్, ఆధార్ వ్యవస్థలో ఉన్న లొసుగులను ఎత్తిచూపుతూ కీలక మార్పులను ప్రతిపాదించింది.

పిటిషన్ లోని ప్రధాన డిమాండ్లు ఇవే:

  • వయోపరిమితి: కొత్త ఆధార్ కార్డులను కేవలం 6 ఏళ్ల లోపు పిల్లలకు మాత్రమే జారీ చేయాలని, ఆపై వయస్సు ఉన్నవారికి కార్డు ఇవ్వకూడదని పిటిషనర్ కోరారు.

  • కఠిన తనిఖీలు: ఒకవేళ 6 ఏళ్లు పైబడిన వారు (అడల్ట్స్ మరియు అడొలసెంట్స్) ఆధార్ కోసం దరఖాస్తు చేసుకుంటే, వారిపై చాలా కఠినమైన విచారణ జరపాలని, తహసీల్దార్ లేదా SDM స్థాయి అధికారుల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన జరగాలని కోరారు.

  • సిటిజన్‌షిప్ ప్రూఫ్ కాదు: ఆధార్ కేంద్రాల వద్ద పెద్ద బోర్డులు ఏర్పాటు చేసి, "ఆధార్ కేవలం ఒక గుర్తింపు కార్డు మాత్రమే.. ఇది పౌరసత్వానికి, పుట్టిన తేదీకి లేదా అడ్రస్ ప్రూఫ్‌కు ఆధారం కాదు" అని స్పష్టంగా ప్రదర్శించాలని పిటిషనర్ డిమాండ్ చేశారు.

ఎందుకు ఈ డిమాండ్?

ప్రస్తుత ఆధార్ వెరిఫికేషన్ వ్యవస్థ చాలా బలహీనంగా ఉందని, దీన్ని అడ్డుపెట్టుకుని విదేశీ చొరబాటుదారులు (Infiltrators) సులభంగా ఆధార్ పొందుతున్నారని పిటిషన్ పేర్కొంది.

  1. నకిలీ ధ్రువపత్రాలు: ఆధార్‌ను అడ్డుపెట్టుకుని రేషన్ కార్డులు, ఓటర్ ఐడీలు, డొమిసిల్ సర్టిఫికేట్లు పొంది, చొరబాటుదారులు భారతీయులుగా చలామణి అవుతున్నారని ఆరోపించారు.

  2. దేశ భద్రత: ఇలాంటి నకిలీ ఎన్‌రోల్‌మెంట్లు దేశ భద్రతకు, ఎన్నికల పారదర్శకతకు ముప్పుగా పరిణమిస్తాయని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు.
  3. 99% పూర్తి: ఇప్పటికే దేశంలో 144 కోట్లకు పైగా ఆధార్ కార్డులు జారీ అయ్యాయని, అంటే దాదాపు 99% మంది భారతీయులకు ఆధార్ ఉందని, కాబట్టి ఇకపై కేవలం కొత్తగా పుట్టే పిల్లలకు మాత్రమే ఆధార్ పరిమితం చేయాలని వాదించారు.

ఈ పిటిషన్ పై సుప్రీం కోర్టు త్వరలో విచారణ జరిపే అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు సానుకూలంగా స్పందిస్తే, ఆధార్ జారీ ప్రక్రియలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది.