ఇరాన్‌పై ఇజ్రాయెల్ భారీ ప్రతీకార దాడులు.. తెహ్రాన్‌తో సహా పలు నగరాల్లో పేలుళ్లు!

Published on: 08 Jun 2026, 02:13 AM
News Article

హైదరాబాద్ న్యూస్‌టైమ్ (డిజిటల్ బ్యూరో), జూన్ 08, 2026: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. తమ భూభాగంపైకి ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్న తర్వాత, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఇరాన్‌పై భారీ ప్రతీకార దాడులకు దిగింది. పశ్చిమ మరియు మధ్య ఇరాన్‌లోని కీలక సైనిక లక్ష్యాలే ధ్యేయంగా ఇజ్రాయెల్ వాయుసేన విరుచుకుపడినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. ఈ దాడుల దాటికి ఇరాన్ రాజధాని తెహ్రాన్‌తో పాటు కనీసం మూడు ప్రధాన నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ CNN వెల్లడించింది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలను, క్షిపణి ఉత్పాదక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది. రాజధాని నగరంలో వరుస పేలుళ్ల శబ్దాలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తాజా దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోగా, ప్రాణనష్టం మరియు ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది.