'ఈ రాత్రి నీతో గడపాలని ఉంది' భార్యతో ఫోన్ చేయించి.. ప్రియుడిని కిరాతకంగా నరికి చంపిన భర్త!

Published on: 02 Sep 2026, 12:30 PM
News Article

అనంతపురం, సెప్టెంబర్ 2, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. భార్యతోనే ప్రియుడికి ఫోన్ చేయించి.. పక్కా ప్రణాళికతో రప్పించి దారుణంగా నరికి చంపిన ఘటన అనంతపురం నగర శివారులో తీవ్ర కలకలం రేపింది. బళ్లారి రోడ్డులోని ఆరాధ్య హోమ్స్‌ సమీపంలో శనివారం అర్ధరాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం నగరంలోని తపోవనం ప్రాంతానికి చెందిన మఠం సోమశేఖర్‌ చిన్న కుమారుడు భరద్వాజ్‌ (33) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో నగరంలో ఓ టిఫిన్ సెంటర్‌ నడుపుతున్న మహిళతో అతనికి పరిచయం ఏర్పడి, అది క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలుసుకున్న ఆమె భర్త శ్రీహరి.. పలుమార్లు భరద్వాజ్‌ను తీవ్రంగా హెచ్చరించాడు. అయినా వారి తీరులో ఎలాంటి మార్పు రాలేదు. పైగా గత మార్చిలో సదరు మహిళను భరద్వాజ్ తనతో తీసుకెళ్లిపోవడంతో, వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ కేసు కూడా నమోదైంది. ఈ కేసులో జైలుకెళ్లి వచ్చినా భరద్వాజ్‌ పద్ధతి మార్చుకోలేదు. తన భార్యతో సంబంధం కొనసాగిస్తుండటంతో రగిలిపోయిన శ్రీహరి.. అతన్ని ఎలాగైనా మట్టుబెట్టాలని పక్కా స్కెచ్ వేశాడు. పథకంలో భాగంగా.. శనివారం రాత్రి శ్రీహరి తన భార్య చేతనే భరద్వాజ్‌కు ఫోన్ చేయించాడు. ఆరాధ్య హోమ్స్‌ సమీపంలోని ఓ నిర్జన ప్రదేశానికి రావాలని ఆమె ద్వారా పిలిపించాడు. ఆమె మాటలు నమ్మి కారులో అక్కడికి చేరుకున్న భరద్వాజ్‌పై.. అప్పటికే కాపు కాసిన శ్రీహరి, అతని బంధువులు అనిల్, కుమార్, రామాంజిలు ఒక్కసారిగా దాడికి దిగారు. కొడవళ్లు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేయడంతో భరద్వాజ్ కుడిచేయి తెగిపడింది. తీవ్రగాయాలతో రక్తపుమడుగులో విలవిల్లాడుతుండగా నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో అర్బన్ డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ శ్రీకాంత్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న భరద్వాజ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అనంతపురం రూరల్ పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం ఏడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.