ఉద్యోగం వచ్చిందని ప్రియుడిని దూరం పెట్టిన యువతి.. పేపర్ లీక్ బాగోతం బయటపెట్టి కక్ష తీర్చుకున్న ప్రియుడు
ముంబై, సెప్టెంబర్ 2, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): మహారాష్ట్రలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఉద్యోగ పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ వెలుగుచూసింది. లీకైన పేపర్‌తో ప్రభుత్వ ఉద్యోగం ఖాయమైందని భావించి ప్రియుడిని పక్కనపెట్టిన ఓ యువతి.. చివరకు తన తండ్రితో సహా కటకటాల పాలైంది. మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం నిర్వహించిన ఎఫ్‌డీఏ (FDA) ఉద్యోగ పరీక్ష కోసం రుతుజా పాటిల్ అనే యువతి తండ్రి దళారులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పరీక్షకు ముందే ప్రశ్నాపత్రాన్ని పొందేందుకు ఏకంగా రూ. 5 లక్షలు చెల్లించాడు. ఆ పేపర్‌ను దక్కించుకున్న రుతుజా.. దానిని తన బాయ్‌ఫ్రెండ్ గౌరవ్‌తో పంచుకుంది. గౌరవ్ సోదరుడు కూడా అదే పరీక్షకు సన్నద్ధమవుతుండటంతో అతనికి కూడా ఆ పేపర్ ఇచ్చారు. అయితే, పేపర్ ముందుగానే అందినప్పటికీ గౌరవ్ సోదరుడు ఆ పరీక్షలో ఫెయిల్ కావడం గమనార్హం. మరోవైపు ఇదే పరీక్ష రాసిన రుతుజా ఏకంగా 7వ ర్యాంక్ సాధించింది. తనకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని పూర్తి ధీమాతో ఉన్న ఆమె.. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న ప్రియుడు గౌరవ్‌ను క్రమంగా దూరం పెట్టడం ప్రారంభించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గౌరవ్, తనను మోసం చేసిందనే కోపంతో పేపర్ లీక్ వ్యవహారాన్ని మొత్తం వివరిస్తూ నేరుగా MPSC (మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్) కు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. గౌరవ్ ఇచ్చిన పక్కా ఆధారాలతో ఈ పేపర్ లీక్ బాగోతం వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ పరీక్షను పూర్తిగా రద్దు చేశారు. ఈ కుంభకోణంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. రుతుజా తండ్రిని, ఫిర్యాదు చేసిన గౌరవ్‌తో పాటు ముగ్గురు MPSC అధికారులను కలిపి మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు. ప్రియుడిని మోసం చేయబోయి ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాల కుంభకోణం బయటపడటం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.