ఉద్యోగుల గుండెల్లో ధైర్యం నింపిన రేవంత్.. ఆ ఒక్క నిర్ణయంతో రూపురేఖలు మారనున్నాయా?

Published on: 25 Jun 2026, 03:56 PM
News Article

హైదరాబాద్, జూన్ 25 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): సింగరేణి, విద్యుత్, ఆర్టీసీ ఇలా ఏ విభాగమైనా ఉద్యోగులందరికీ ప్రభుత్వమే యజమాని అని, వారిలో నమ్మకం కలిగిస్తూ సంపూర్ణ భద్రత కల్పించాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపైనే ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రవీంద్రభారతిలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ బీమా సౌకర్యం కల్పించే మెగా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం సమక్షంలో ఉద్యోగుల బీమా రక్షణ కొరకు వివిధ 16 ప్రముఖ బ్యాంకులతో రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక అవగాహనా ఒప్పందాలు (MoUs) చేసుకుంది. గత పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం సృష్టించి, రాష్ట్రాన్ని రూ. 8.11 లక్షల కోట్ల అప్పుల్లో ముంచడమే కాకుండా ఒకటో తారీఖున జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తెచ్చారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక విడతల వారీ విధానానికి స్వస్తి చెప్పి ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని, రిటైర్మెంట్ వయస్సు పెంపు వల్ల పేరుకుపోయిన బెనిఫిట్స్ కోసం ప్రతి నెలా రూ. 200 కోట్ల నుండి రూ. 700 కోట్లు చెల్లిస్తూ.. వంద రోజుల్లో రూ. 6 వేల కోట్లు ఇస్తామన్న మాట ప్రకారం తొలి విడతగా రూ. 1,000 కోట్లు విడుదల చేశామని గుర్తుచేశారు. పీఆర్సీ (PRC) విషయంలోనూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని భరోసా ఇస్తూ.. "మీ సోదరుడే సీఎంగా ఉన్నాడు, పన్నులు ఎగ్గొట్టే అక్రమార్కులను కట్టడి చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు రోజుకు ఒక గంట అదనంగా శ్రమించండి" అని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల విజయాల వెనుక ఉద్యోగుల శ్రమ ఎంతో ఉందన్న సీఎం, 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మార్చడమే లక్ష్యంగా మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, కుల గణన, ఎస్సీ వర్గీకరణ వంటి ప్రతిష్టాత్మక పనులను వేగవంతం చేస్తున్నామని, వీటికి ప్రతిపక్షాలు కాళ్లల్లో కట్టెలు పెట్టి అడ్డుకోవాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ సంచలన కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గడ్డం వివేక్, ఉన్నతాధికారులు మరియు బ్యాంక్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.