ఉపాధి హామీ రక్షణకై గర్జించిన గట్టుప్పల...

Published on: 15 May 2026, 10:55 AM
News Article


  • కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉపాధి కూలీల ఆగ్రహం
  • నేడు దేశవ్యాప్త బంద్‌కు పిలుపు
  • విబిజి రాంజీ పథకాన్ని రద్దు చేయాలి: కర్నాటి సుధాకర్
  • రూ. 800 కూలి, 200 రోజుల పని దినాలకై డిమాండ్
  • సమ్మెలో భారీగా పాల్గొనాలని ఫీల్డ్ అసిస్టెంట్లు, కూలీలకు విజ్ఞప్తి

గట్టుప్పల | శనివారం | మే 15, 2026 కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ, కొత్తగా ప్రవేశపెట్టిన విబిజి రాంజీ పథకాన్ని నిరసిస్తూ నేడు (మే 15న) నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త గ్రామీణ సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం గట్టుప్పల మండల ప్రధాన కార్యదర్శి కర్నాటి సుధాకర్ పిలుపునిచ్చారు. చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుండి గ్రామీణ వలసలు తగ్గాయని, ఇప్పుడు నిధుల కోత విధిస్తూ కేంద్రం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కూలీలకు రోజుకు రూ. 800 వేతనం, ఏడాదికి 200 రోజుల పని కల్పించడంతో పాటు, పెండింగ్ వేతనాలన్నీ వెంటనే విడుదల చేయాలని, ప్రమాద బీమా కింద రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమ్మెలో ఉపాధి కూలీలతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్లు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సుధాకర్ విజ్ఞప్తి చేశారు.