ఎంఎస్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి.. లండన్‌లో కామారెడ్డి కుర్రాడికి అసలేం జరిగింది?
Published on: 26 Jun 2026, 02:11 PM
హైదరాబాద్, జూన్ 26 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి లండన్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన శ్రీనాథ్ రెడ్డి (25) లండన్‌లోని లీసెస్టర్ యూనివర్సిటీలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాగా, రెండు రోజుల క్రితం ఒక స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు హాజరైన శ్రీనాథ్ రెడ్డి, రాత్రి నిద్రపోయిన తర్వాత తెల్లవారేసరికి విగతజీవిగా పడి ఉన్నట్లు అక్కడే ఉంటున్న అతని బంధువులకు స్నేహితులు సమాచారం అందించారు. ఉన్నత చదువులు చదివి ప్రయోజకుడవుతాడనుకున్న కన్నకొడుకు ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడనే వార్త తెలియడంతో తలమడ్ల గ్రామంలోని అతని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.