ఎక్సైజ్ ఎస్టీఎఫ్ మెరుపు దాడి: 4 కేజీల గంజాయి పట్టివేత..
Published on: 30 Mar 2026, 03:55 PM
హైదరాబాద్: నగరంలో గంజాయి నెట్‌వర్క్‌పై ఎక్సైజ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు గంజాయి సరఫరా అవుతున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో ఎస్టీఎఫ్ ఏ టీం (STF A-Team) లీడర్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో లంగర్ హౌస్ ప్రాంతంలో మెరుపు దాడులు నిర్వహించారు.
మహారాష్ట్ర టు హైదరాబాద్.. గల్లీల్లో అమ్మకాలు!
ఈ దాడుల్లో మహమ్మద్ షఫీ (27) అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 4.1 కేజీల గంజాయి, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి:
- మహారాష్ట్రకు చెందిన సల్మాన్ ఖాన్ వద్ద కిలో గంజాయిని రూ. 10,000కు కొనుగోలు చేస్తున్నాడు.
- అదే గంజాయిని చిన్న చిన్న పాకెట్లుగా (10 గ్రాములు) మార్చి, గల్లీల్లో ఒక్కో పాకెట్‌ను రూ. 500కు విక్రయిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నాడు.
ఎనిమిది మందిపై నిఘా..
ఈ అక్రమ దందాలో షఫీ ఒక్కడే కాకుండా మరికొందరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జాఫర్, షేక్ అబ్దుల్లా, యాసిన్, సయ్యద్ ఇర్ఫాన్, మహమ్మద్ మోసిన్, జుబేద్, మహమ్మద్ బిన్ అలీలపై కేసులు నమోదు చేసినట్లు అంజిరెడ్డి తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.