ఎక్స్ గ్రేషియా నిధులు విడుదల చేయాలి - గీత పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్

Published on: 02 Aug 2026, 05:11 AM
News Article

హైదరాబాద్, ఆగస్ట్ 2, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్ - యాదాద్రి భువనగిరి జిల్లా): ప్రమాదాల్లో మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని గీత పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడతూ.. రాష్ట్రవ్యాప్తంగా కల్లుగీత వృత్తిపై లక్షలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, ప్రమాదకరమైన ఈ వృత్తిలో మరణిస్తున్న కార్మికుల ఎక్స్ గ్రేషియాను రూ. 10 లక్షలకు పెంచాలని కోరారు. ఎన్నికల హామీ ప్రకారం 50 ఏళ్లు నిండిన ప్రతి గీత కార్మికునికి నెలకు రూ. 5,000 పింఛన్ మంజూరు చేయాలని, 560 జీవో ప్రకారం ప్రతి సొసైటీకి 10 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించి తాటి, ఈత వనాలను పెంచాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తాటి, ఈత వనాలున్న ప్రాంతాల్లో ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని, మృతి చెందిన కార్మికుల భార్యలకు వెంటనే వితంతు పెన్షన్ ఇవ్వాలని, ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీలో గీత వృత్తి నైపుణ్య కోర్సులు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. మండల అధ్యక్షుడు పందుల యాదగిరి గౌడ్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర సమన్వయ కార్యదర్శి బొమ్మగాని నాగభూషణం, జిల్లా నాయకులు మోగదాల సత్తయ్య, వీరమల్ల యాదయ్య, నీళ్ల గాలయ్య, మాధగోని బాలరాజు, పల్లె రాములు, పెద్దగోని విష్ణు, బొమ్మగాని చంద్రయ్య, బత్తిని మల్లేష్, నాతి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.