ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి చొరవతో ‘గుజ్జ’ నీటి కష్టాలకు చెక్!

Published on: 28 Jun 2026, 11:14 AM
News Article

సంస్థాన్ నారాయణపురం, జూన్ 28 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని గుజ్జ గ్రామంలో దీర్ఘకాలంగా వేధిస్తున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక సహకారంతో గ్రామంలోని మంచినీటి బోరుబావిలో కొత్తగా మోటార్, పైప్‌లైన్ పనులను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ పనుల ద్వారా గ్రామ ప్రజల ప్రధాన మంచినీటి అవసరాలను తీర్చినట్లు సర్పంచ్ ఎర్ర కవితా సైదులు అధికారికంగా వెల్లడించారు.

గ్రామంలో తాగునీటి ఎద్దడి రాకుండా సకాలంలో స్పందించి, నిధులు కేటాయించి నీటి సమస్యను పూర్తిగా పరిష్కరించినందుకు గాను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సర్పంచ్ ఎర్ర కవితా సైదులు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులతో పాటు గుజ్జ గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఎండకాలం ముగిసినా కొన్ని చోట్ల నీటి ఇబ్బందులు తలెత్తుతున్న తరుణంలో.. ఎమ్మెల్యే చొరవతో తమ గ్రామానికి తాగునీటి వసతి పక్కాగా సమకూరడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది, మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.