ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన చౌటుప్పల్ నూతన కాంగ్రెస్ అధ్యక్షులు
హైదరాబాద్ న్యూస్‌టైమ్, చౌటుప్పల్/హైదరాబాద్, జూన్ 13, 2026: చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్ ఉబ్బు వెంకటయ్య ఆధ్వర్యంలో చౌటుప్పల్ మండల, మున్సిపల్ నూతన కాంగ్రెస్ అధ్యక్షులు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. చౌటుప్పల్ మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైన బోయ దేవేందర్, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైన కాసర్ల శ్రీనివాస్ రెడ్డిలు హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బోయ దేవేందర్, కాసర్ల శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ... తమపై నమ్మకంతో పార్టీ అధ్యక్షులుగా అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, అభ్యున్నతికి కంకణబద్ధులమై నిరంతరం శ్రమిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు దుబ్బాక ఆకాష్ రెడ్డితో పాటు చౌటుప్పల్ ప్రాంతానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.