సంస్థాన్ నారాయణపురం, నవంబర్ 21, 2026 (హైదరాబాద్ న్యూస్టైమ్): మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు పున్న కైలాష్ నేత చేసిన రాజీనామా వ్యాఖ్యలను సంస్థాన్ నారాయణపురం మండల యువజన కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. శనివారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మెగావత్ రెడ్యా నాయక్ మాట్లాడారు.
అభివృద్ధి నిధులు కోరడం తప్పా? ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయాలని కోరడం తప్పా అని రెడ్యా నాయక్ ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం రహదారులు, పాఠశాలలు, ప్రభుత్వ భవనాలు, డిండి ఎత్తిపోతల పథకం, చల్లగూడెం జలాశయంతో పాటు ఇతర అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కోరడం తప్పుగా కనిపిస్తోందా అని నిలదీశారు. ఒక బీసీ బిడ్డగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రజా సమస్యలపై మీరు ఎంతవరకు పోరాటం చేశారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి సోదరులకు ఉన్న రాజకీయ దమ్ము, ధైర్యం మీకు ఉందా అని విమర్శించారు.
రాజన్న సైన్యం చూస్తూ ఊరుకోదు: జిల్లా అధ్యక్ష పదవి కోసం గతంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని బతిమిలాడిన విషయాన్ని అప్పుడే మర్చిపోయారా అని రెడ్యా నాయక్ నిలదీశారు. మైకు ఉంది కదా, నోరు ఉంది కదా అని ఇష్టానుసారంగా ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తే మునుగోడు నియోజకవర్గ ప్రజలు, రాజన్న సైన్యం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని హెచ్చరించారు. అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకుని, జిల్లా అధ్యక్ష పదవికి తగిన విధంగా వ్యవహరించాలని హితవు పలికారు. ఇకనైనా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తప్పుడు వ్యాఖ్యలు చేయకుండా పార్టీ క్రమశిక్షణకు లోబడి వినయ విధేయతలతో మెలగాలని సూచించారు.
ఈ సమావేశంలో యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు గుజ్జారి శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఉప్పల నాగరాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బలగొని మల్లేష్, ఎర్రోళ్ల లింగస్వామి, భాను కిరణ్ కుమార్, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.