ఏఐ కంటే మనుషులే మిన్న.. ఫోర్డ్ ప్లాంట్లలో మళ్లీ పాత ఇంజనీర్ల హవా!
హైదరాబాద్, జూన్ 30 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ఖర్చులను తగ్గించుకోవచ్చు, ప్రొడక్టివిటీ పెంచేయొచ్చు అనే ఉద్దేశంతో కార్ల క్వాలిటీ చెకింగ్ (నాణ్యత పరిశీలన) విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను నమ్ముకున్న ప్రముఖ అమెరికన్ కార్ల తయారీ సంస్థ ‘ఫోర్డ్’ (Ford) కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మానవ ఇంజనీర్ల నైపుణ్యాలు, అనుభవంతో పోలిస్తే ఏఐ ఆటోమేటెడ్ సిస్టమ్స్ నాణ్యతా ప్రమాణాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాయి. దీంతో ఫోర్డ్ సంస్థ తన తప్పును తెలుసుకొని, గతంలో కంపెనీ నుంచి వెళ్ళిపోయిన దాదాపు 300 మందికి పైగా సీనియర్ 'వెటరన్' క్వాలిటీ ఇన్‌స్పెక్టర్లను, నిపుణులైన ఇంజనీర్లను మళ్ళీ ఉద్యోగాల్లోకి చేర్చుకుంది.
ట్రెండ్ చూసి మోసపోయాం.. డేటా మాత్రమే సరిపోదు: కార్ల ప్లాంట్లలో క్వాలిటీ లోపాలను పసిగట్టేందుకు ఫోర్డ్ సంస్థ ఏకంగా 900 ఏఐ ఆధారిత కెమెరాలను అమర్చింది. కేవలం డిజైన్ అవసరాలను కంప్యూటర్‌లో ఫీడ్ చేస్తే ఏఐ అద్భుతమైన ప్రొడక్ట్‌ను ఇస్తుందని భావించామని, కానీ అది ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయిందని ఫోర్డ్ వెహికల్ హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ చార్లెస్ పూన్ వెల్లడించారు. "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక అద్భుతమైన టూల్ మాత్రమే. దానికి మనం ఇచ్చే ట్రైనింగ్ డేటా ఎంత బాగుంటే అది అంత బాగా పనిచేస్తుంది. కానీ ఎన్నో ఏళ్లుగా మాతో ఉండి, ప్రతి ప్రొడక్ట్ సైకిల్‌ను దగ్గరుండి చూసిన మా సీనియర్ ఇంజనీర్ల నిజమైన అనుభవానికి, ఈ ఆటోమేటెడ్ సిస్టమ్స్ సాటిరాలేవు" అని ఆయన స్పష్టం చేశారు. ఈ వెటరన్ ఇంజనీర్లను ఇప్పుడు ఏఐ టూల్స్‌ను మరింత పక్కాగా ట్రైన్ చేయడానికి, అలాగే యువ ఉద్యోగులకు మెంటార్‌షిప్ ఇవ్వడానికి వాడుతున్నట్లు సంస్థ తెలిపింది. ఈ కీలక నిర్ణయం వల్లే ఫోర్డ్ సంస్థ అమెరికా 'జేడీ పవర్ ఇనిషియల్ క్వాలిటీ స్టడీ' (JD Power Initial Quality Study) రేటింగ్‌లో 2010 తర్వాత మళ్లీ మొదటి స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.