ఏపీలో మరో ఘోర అగ్నిప్రమాదం.. పరవాడ ఫార్మాసిటీలో ఇద్దరు కార్మికుల సజీవ దహనం!
అనకాపల్లి, జూన్ 23 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ఏపీలో పారిశ్రామిక వాడల్లో వరుస అగ్నిప్రమాదాలు కార్మికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మరో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫార్మాసిటీలోని 'దక్షిణ ఎనర్జీ కెమికల్' కర్మాగారంలో అకస్మాత్తుగా భారీ మంటలు చెలరేగాయి. రసాయన కర్మాగారం కావడంతో మంటలు క్షణాల్లోనే ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మృతులను వెంకటేష్ (34), కొవ్వాడ త్రినాథ రావు (24)గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ఉపాధి కోసం వచ్చిన యువకులు ఇలా అగ్నికి ఆహుతి కావడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.