ఏబీఎన్ రాధాకృష్ణకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వార్నింగ్
హైదరాబాద్, ఆగస్ట్ 26, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ఏబీఎన్ మీడియా సంస్థ అధినేత రాధాకృష్ణపై మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడతూ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు. తమ నాయకత్వాన్ని, రాజకీయ భవిష్యత్తును కించపరిచే విధంగా వార్తలు రాస్తే ఊరుకునేది లేదని, "సోదరా ABN రాధాకృష్ణ.. మా గురించి రాసే ముందు చూసుకొని రాయి, బావుండదు హెచ్చరిస్తున్నా, కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది" అంటూ ఘాటుగా స్పందించారు. ఏబీఎన్ లాంటి వంద ఛానెల్స్ పెట్టే శక్తి తమకు ఉందని, తాము తలుచుకుంటే ఇక్కడ ఏ ఛానెల్, ఏ పేపర్ కూడా నిలబడలేవని సవాల్ విసిరారు. జర్నలిస్టులు మరియు మీడియా అంటే తనకు ఎప్పుడూ గౌరవం ఉందని పేర్కొన్న ఆయన, మీడియా ముసుగులో తెలంగాణలో రాజకీయ నాయకులను కించపరిచేలా వ్యవహరించే ఆంధ్ర మీడియా ఛానెళ్ల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని, తమకు సర్టిఫికేట్లు ఇవ్వాల్సిన అవసరం ఏ మీడియానూ లేదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ, మీడియా సర్కిళ్లలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.