ఏసీబీ వలలో అవినీతి తిమింగలం: రూ. 60 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన ఆర్‌ఐ!
బాపట్ల: అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ (ACB) మరోసారి వణుకు పుట్టించింది. బాపట్ల నగరపాలక సంస్థలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (RI) గా పనిచేస్తున్న షేక్ ఇమామ్, రూ. 60 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.
టీ హౌస్ వద్ద డీల్.. సీన్ లోకి ఏసీబీ! సూర్యలంక రహదారిలోని ముత్తయ్యపాలెం టీ హౌస్ వద్ద ఈ లంచం లావాదేవీ జరుగుతుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ నేతృత్వంలో నలుగురు సీఐలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. బాధితుడి నుంచి రూ. 60 వేలు తీసుకుంటుండగా షేక్ ఇమామ్ ను అదుపులోకి తీసుకున్నారు.
ముమ్మరంగా కొనసాగుతున్న విచారణ: నిందితుడైన ఆర్‌ఐను అదుపులోకి తీసుకున్న అధికారులు, వెంటనే నగరపాలక సంస్థ కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తూ విచారణ కొనసాగిస్తున్నారు. ఏసీబీ దాడుల వార్తతో బాపట్ల మున్సిపల్ కార్యాలయంలోని ఇతర సిబ్బందిలో కలకలం రేగింది.