ఏసీబీకి చిక్కిన భద్రాచలం ఎఫ్డీవో..
హైదరాబాద్ న్యూస్ టైమ్ | మే 07, 2026
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి చేపలు ఏసీబీ వలకు చిక్కాయి. భద్రాచలం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ (FDO) సంతపురి సుజాత, చెర్ల ఇన్‌ఛార్జ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) భుక్యా కృష్ణ గురువారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. చర్ల మండలం పూసుగుప్ప గ్రామం నుండి ఛత్తీస్‌గఢ్ సరిహద్దు వరకు 2 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణ సమయంలో అటవీ చెట్లకు నష్టం కలిగించారనే నెపంతో కేసు నమోదు చేయకుండా ఉండటానికి, అలాగే భవిష్యత్తు పనుల్లో ఇబ్బంది కలిగించకుండా ఉండటానికి వీరు భారీగా లంచం డిమాండ్ చేశారు. మొదట రూ. 10 లక్షలు డిమాండ్ చేసిన ఈ అధికారులు, చివరకు రూ. 3.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బాధితుడి నుండి ఈ మొత్తాన్ని భద్రాచలంలోని ఎఫ్డీవో కార్యాలయంలో తీసుకుంటుండగా ఖమ్మం రేంజ్ ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి పట్టుకున్నారు. అధికారుల వద్ద నుండి రసాయనాలతో కూడిన నోట్లను స్వాధీనం చేసుకున్న ఏసీబీ బృందం, కార్యాలయంలోని పలు కీలక దస్త్రాలను కూడా తనిఖీ చేసింది. గతంలోనూ వీరిపై పలు ఫిర్యాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో, ఈ కోణంలోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను అరెస్ట్ చేసి వరంగల్ లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ దాడితో జిల్లాలోని ఇతర శాఖల అధికారుల్లోనూ గుబులు మొదలైంది. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.