ఐఐటీ హైదరాబాద్‌లో సీటు.. విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి!
యాదాద్రి భువనగిరి, జూన్ 25 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఎం.డి అసత్ షరీఫ్‌ను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు నయీమ్ షరీఫ్ కుమారుడైన అసత్ షరీఫ్.. జేఈఈ మెయిన్స్ సెషన్-1లో 96 శాతం, సెషన్-2లో 98 శాతంతో పాటు జేఈఈ అడ్వాన్స్డ్ ఓబీసీ కేటగిరీలో 2707వ ర్యాంకు సాధించి ఐఐటీ హైదరాబాద్ (IIT Hyderabad) లో సీటు కైవసం చేసుకున్నాడు. ప్రభుత్వ కాలేజీలో చదివి జాతీయ స్థాయిలో సంచలన విజయం సాధించిన అసత్ షరీఫ్ ప్రతిభను ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో నారాయణపురం గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.