ఐఫోన్ కోసం కాదు.. కుటుంబ తగాదాలే కారణం: ఛత్రపతి శంభాజీనగర్ ఉదంతంలో పోలీసుల వెల్లడి

Published on: 26 Aug 2026, 05:24 AM
News Article

ఛత్రపతి శంభాజీనగర్, ఆగస్ట్ 26, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో జరిగిన కుటుంబం మృతి ఘటనకు సంబంధించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఖువాడియా హిల్స్ వద్ద 19 ఏళ్ల కునాల్ చాంద్‌గుడే మరియు ఆయన తల్లిదండ్రులు మృతి చెందడానికి ఐఫోన్ వివాదం కారణం కాదని, కేవలం కుటుంబ తగాదాలే ఈ విషాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేల్చారు. ఈ ఘటనలో తండ్రి మురళీధర్, తల్లి సంగీత, 19 ఏళ్ల కుమారుడు కునాల్ ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. మురళీధర్ ఓ ట్రాన్స్‌పోర్టు కంపెనీలో మేనేజర్‌గా పనిచేసేవారు. కుటుంబ వివాదాల నేపథ్యంలో ఆయన పనిలో మునిగిపోయి నెలల తరబడి ఇంటికి దూరంగా ఉండేవారు. పెద్ద కుమారుడు సుమారు ఆరేళ్ల కిందట అనారోగ్యంతో మరణించడంతో కుటుంబంలో ఒంటరితనం పెరిగింది. ఈ నేపథ్యంలో తన తండ్రిని తిరిగి ఇంటికి వచ్చేలా ఒప్పించి, ఇకపై అందరం కలిసి జీవించేలా హామీ పొందేందుకే కునాల్ తన తల్లిదండ్రులను కొండ అంచుకు తీసుకెళ్లినట్లు సమాచారం.

యూట్యూబ్ వీడియోలో సంచలన ఆరోపణలు: ఈ ఘటన జరగడానికి సరిగ్గా రెండు రోజుల ముందు తండ్రి మురళీధర్ ఇంటికి తిరిగి వచ్చారు. అయితే, ఘటనకు ఒక్క రోజు ముందు కుమారుడు కునాల్ యూట్యూబ్ ఛానల్‌లో తల్లి సంగీత మాట్లాడిన వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో మానవ సంబంధాలు, ప్రేమ విలువలను వివరించిన సంగీత.. తన బంధువుల్లో కొందరిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ కుటుంబాన్ని వేధించారని, ఆస్తుల తగాదాలు సృష్టించారని ఆమె ఆరోపించడం గమనార్హం. మరోవైపు, సంగీత తరపు బంధువులు మాత్రం మురళీధర్-సంగీత దంపతుల మధ్య ఆస్తుల విషయాల్లో తీవ్ర విభేదాలు ఉన్నాయని తెలిపారు. కొన్నాళ్లుగా తల్లిదండ్రులు వేర్వేరుగా ఉంటున్నారని, ఎలాగైనా తల్లిదండ్రులు ఇద్దరూ కలసి జీవించాలని కుమారుడు కునాల్ బలంగా కోరుకున్నాడని బంధువులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ యూట్యూబ్ వీడియోలో సంగీత చేసిన ఆరోపణలు మరియు ఇతర కుటుంబ పరిస్థితులపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.