ఓల్డ్ సిటీ ‘గోల్డ్ మ్యాన్’ సూర్యాభాయ్ అరెస్ట్..

Published on: 26 Jun 2026, 05:22 AM
News Article

హైదరాబాద్, జూన్ 26 (హైదరాబాద్ న్యూస్‌టైమ్):సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పేర్లు చెప్పుకుంటూ అమాయక ప్రజల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్న ఓల్డ్ సిటీ ‘గోల్డ్ మ్యాన్’ సూర్యాభాయ్‌ను అత్తాపూర్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

​ఒళ్లంతా బంగారం.. తక్కువ ధరకే ఇప్పిస్తానని టోకరా: నిందితుడు సూర్యాభాయ్ ఎప్పుడూ ఒళ్లంతా కిలోల కొద్దీ బంగారం ధరించి తిరుగుతూ, తనను తాను పెద్ద ‘గోల్డ్ మ్యాన్’గా ప్రచారం చేసుకునేవాడు. తనకు మార్కెట్ కంటే చాలా తక్కువ ధరకే స్వచ్ఛమైన బంగారం ఇప్పించే పరిచయాలు ఉన్నాయంటూ నమ్మబలికేవాడు. దీనికి తోడు తనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడని, హైదరాబాద్ సీపీ తనకు ప్రాణస్నేహితుడని నకిలీ బిల్డప్ ఇస్తూ బాధితుల నుండి లక్షల రూపాయలు వసూలు చేశాడు.

​నిలదీస్తే బెదిరింపులు – అత్తాపూర్ పోలీసుల యాక్షన్: డబ్బులు ఇచ్చి నెలలు గడుస్తున్నా బంగారం ఇవ్వకపోవడంతో బాధితులు అతడిని నిలదీశారు. దీంతో సూర్యాభాయ్ తనకున్న రాజకీయ, పోలీస్ రికమండేషన్ల పేరుతో బాధితులను రివర్స్‌లో బెదిరించడం ప్రారంభించాడు. తాను మోసపోయామని గమనించిన బాధితులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సూర్యాభాయ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ కేటుగాడి చేతిలో ఇంకా ఎవరెవరు మోసపోయారనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.