కాంగ్రెస్ గ్రామాలకే కేంద్ర నిధులా?.. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో మునుగోడు బీజేపీ సర్పంచుల ఆవేదన!

Published on: 27 Jun 2026, 02:33 PM
News Article

మునుగోడు, జూన్ 27 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు ఇస్తున్న నిధులను స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పక్షపాత ధోరణితో కేవలం కాంగ్రెస్ సర్పంచులు ఉన్న గ్రామాలకు మాత్రమే మళ్లిస్తున్నారంటూ మునుగోడు నియోజకవర్గ బీజేపీ సర్పంచులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ బిఎల్ఏ-2ల అవగాహన సదస్సు కోసం మునుగోడు విచ్చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి సర్పంచులు ప్రత్యేకంగా వినతిపత్రం అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ (ఉపాధి హామీ) నిధులను నేరుగా విడుదల చేస్తుంటే.. స్థానిక కాంగ్రెస్ నాయకత్వం మాత్రం రాజకీయ వివక్ష చూపిస్తూ, బీజేపీ సర్పంచులు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామాలకు నిధులు కేటాయించకుండా తొక్కిపెడుతోందని వివరించారు. గత రెండు దఫాలుగా జరుగుతున్న ఈ రాజకీయ పక్షపాత వైఖరి వల్ల తమ గ్రామాల అభివృద్ధి తీవ్రంగా దెబ్బతింటోందని, ప్రజలు అభివృద్ధి ఫలాలను కోల్పోతున్నారని వారు ఆవేదన చెందారు. ఈ నిధుల మళ్లింపు వ్యవహారంపై రాష్ట్ర, కేంద్ర స్థాయిలలో ప్రస్తావించి మునుగోడు ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు మంజులా రెడ్డి, సుర్వి సౌజన్య రాజు గౌడ్, కైరం కొండ స్వప్న అశోక్, ముదిగొండ ఆంజనేయులు, ఉప్పల రమేష్ గౌడ్, తంగెళ్ల వెంకటేష్, నందగిరి వెంకటేష్ గౌడ్, బోయ మహేందర్ మణికుమార్, మంటిపల్లి మణిమాల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.