కాంగ్రెస్‌కు అంజయ్య అల్టిమేటం.. పార్టీ మారే ఛాన్స్!
యాదాద్రి భువనగిరి, ఆగస్ట్ 6, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్ - సంస్థాన్ నారాయణపురం): కాంగ్రెస్ పార్టీని, సర్పంచ్‌లను, జిల్లా నాయకులను నమ్ముకుని ఏళ్ల తరబడి పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తే చివరకు తనకు ఎదురైన అనుభవం మోసమేనని ఆ పార్టీ సీనియర్ నాయకుడు చిలువేరు (పాల) అంజయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ నాయకుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం తాను సైనికుడిలా నిజాయితీగా పనిచేశానని అంజయ్య గుర్తుచేశారు. అయితే పార్టీ కోసం ఇంత చేస్తే తనకు తగిన గుర్తింపు లభించకపోగా, కేవలం పదవుల ఆశ చూపి మోసం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఉప సర్పంచ్ పదవి ఇస్తామని మోసం చేశారని, ఆ తర్వాత వార్డు మెంబర్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పిస్తామంటూ మళ్లీ మొండి చేయి చూపించారని వాపోయారు. అలాగే మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్‌గా నామినేటెడ్ పదవి ఇస్తానని కొంతకాలం ఆశ చూపించి చివరికి మాట తప్పారని మండిపడ్డారు. ఇన్ని మోసాల తర్వాత కనీసం పీఏసీఎస్ (PACS) కమిటీ డైరెక్టర్ పదవి అయినా ఇస్తారని ఆశించానని, కానీ అక్కడ కూడా తన పేరును పక్కన పెట్టి ఇతరుల పేర్లను ప్రపోజ్ చేసి తీవ్ర అన్యాయం చేశారని అంజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు, నాయకులకు జరిగే గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో తనకు జరుగుతున్న ఈ తీవ్ర అన్యాయాన్ని ఇకపై సహించేది లేదని స్పష్టం చేసిన ఆయన.. ఇలాంటి పార్టీలో తాను కొనసాగాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే అవసరమైతే పార్టీ మారేందుకైనా వెనుకాడబోనని ఆయన హెచ్చరించారు.