కాంగ్రెస్‌లో రాజకీయ సంక్షోభంపై బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్, ఆగస్ట్ 25, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు, మంత్రి కొండా సురేఖ పార్టీ మార్పు ప్రచారంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ స్పందించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన ఆమె రాష్ట్ర రాజకీయాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కొండా సురేఖ బీజేపీలోకి వస్తారన్న ప్రచారంపై స్పందిస్తూ.. ఆమె పార్టీలోకి రావాలా వద్దా అనేదానిపై పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని డీకే అరుణ స్పష్టం చేశారు. అలాగే, ప్రస్తుత పరిణామాలపై కామెంట్ చేస్తూ.. కాంగ్రెస్‌లో త్వరలో సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని, ఎవరిని గద్దె దించి, ఎవరిని కూర్చోబెడతారో, ఎవరి పీఠాన్ని ఎవరు కూలుస్తారో వేచి చూడాలని ఆమె ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలు, ఇతర రాజకీయ అంశాలపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు.