కాకతీయుల ఆలయం నేలమట్టం!

Published on: 07 May 2026, 09:28 AM
News Article

హైదరాబాద్ న్యూస్ టైమ్ | మే 07, 2026

వరంగల్: తెలంగాణ చారిత్రక సంపదకు రక్షణ లేకుండా పోతోంది. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ ప్రాంతంలో 800 ఏళ్ల పురాతన శివాలయాన్ని రేవంత్ ప్రభుత్వం కూల్చివేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి కాలంలో నిర్మించిన ఈ అరుదైన ఆలయం, రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలో ఉండటం గమనార్హం. అయితే, ఇక్కడ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సమీకృత పాఠశాల (ఇంటిగ్రేటెడ్ స్కూల్) కోసం స్థలం సరిపోవడం లేదని భావించిన అధికారులు, ఏకంగా బుల్డోజర్‌తో ఈ చారిత్రక కట్టడాన్ని నేలమట్టం చేశారు. ఈ ఘటనపై చరిత్రకారులు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల నిర్మాణం కోసం వేరే స్థలాన్ని ఎంచుకోవచ్చు కానీ, పురాతన ఆలయాన్ని కూల్చడం అన్యాయమని వారు వాదిస్తున్నారు. దీనిపై తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ స్పందిస్తూ.. ఇది తెలంగాణ చరిత్రకు చెరపలేని మచ్చ అని విమర్శించారు. కాకతీయుల వైభవానికి సాక్ష్యంగా నిలిచిన కట్టడాలను కాపాడాల్సిన ప్రభుత్వమే ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం శోచనీయమని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మన వారసత్వ సంపదను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.