కాకినాడ జిల్లాలో అమానవీయ ఘటన: ఫ్రిడ్జ్ వాటర్ తేలేదని తల్లి తల పగలగొట్టి దారుణ హత్య.
కాకినాడ, జూన్ 22 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): అడిగిన వెంటనే తాగడానికి నీళ్లు ఇవ్వలేదన్న కోపంతో కన్నతల్లినే అతి దారుణంగా హతమార్చాడో కసాయి కొడుకు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో జరిగిన ఈ అమానవీయ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం తల్లి నాగమణి (45) తన కుమారుడు రాజబాబుకు భోజనం వడ్డించింది. భోజనం చేస్తూ ఫ్రిడ్జ్‌లోంచి నీళ్లు తీసుకురావాలని కొడుకు అడగగా, ఆమె తీసుకురావడం కాస్త ఆలస్యమైంది. దీంతో కోపంతో అరుస్తూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్న రాజబాబు.. పొరపాటున గుమ్మానికి గుద్దుకోవడంతో అతడికి గాయమైంది. ఆ కోపంతో విచక్షణ కోల్పోయిన రాజబాబు, కన్నతల్లి అని కూడా చూడకుండా ఆమె తలను పూజగదిలోని చెక్క బల్లకేసి బలంగా బాదాడు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితికి చేరుకున్న నాగమణిని చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న ఆమె.. పరిస్థితి విషమించి ఆదివారం ఉదయం ప్రాణాలు కోల్పోయింది. క్షణికావేశం కన్నతల్లి ప్రాణాలనే బలితీసుకోవడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.