కాచిగూడలో గంజాయి బ్యాచ్ అరాచకం: మహిళా ఉద్యోగిపై 10 మందితో కలిసి దాడి!
హైదరాబాద్ న్యూస్‌టైమ్ - కాచిగూడ: భాగ్యనగరం గంజాయి మత్తులో తూగుతోంది. శాంతిభద్రతలకు నిలయమైన రైల్వే స్టేషన్లలోనే సామాన్యులకు రక్షణ కరువైంది. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు మహిళలు, ఒక మహిళా ఉద్యోగిపై 10 మంది పిల్లలతో కలిసి దాడి చేసిన ఉదంతం నగరంలో కలకలం రేపుతోంది.
అసలేం జరిగింది? కాచిగూడ రైల్వే స్టేషన్‌లోని ఫస్ట్ ఎయిడ్ (First Aid) విభాగంలో పనిచేస్తున్న ఒక మహిళపై ఇద్దరు మహిళలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. తమ బృందంలోని ఒక బాలికను సదరు మహిళ కొట్టిందని ఆరోపిస్తూ, గంజాయి మత్తులో ఉన్న ఆ మహిళలు 10 మంది పిల్లలతో కలిసి ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి.
మానవత్వం మంటగలిసింది: దాడి జరుగుతున్న సమయంలో బాధితురాలు ప్రాణభయంతో కేకలు పెడుతూ, ఏడుస్తున్నా కూడా చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులు ఎవరూ అడ్డుకోలేదు. రైల్వే స్టేషన్ వంటి రద్దీ ప్రాంతంలో అందరూ చూస్తూ ఉండిపోయారే తప్ప, తనను కాపాడలేదని బాధితురాలు కన్నీరుమున్నీరవుతోంది.
దొంగతనాలకు అడ్డాగా స్టేషన్ ఆవరణ: ఈ ఘటనపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంజాయికి బానిసైన పిల్లల బృందం రైల్వే స్టేషన్ ఆవరణలోనే తిరుగుతూ, నిద్ర మత్తులో ఉన్న ప్రయాణికుల వస్తువులను దొంగలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. స్టేషన్ పరిసరాల్లో గంజాయి మత్తులో తిరిగే వారి ఆగడాలు మితిమీరిపోతున్నాయని, పోలీసుల నిఘా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.