కామాంధుడి నాలుక కొరికేసిన ధైర్యశాలి!
హైదరాబాద్ న్యూస్ టైమ్ | మే 07, 2026
ఒంటిమిట్ట: వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్టలోని హరిత రిసార్ట్‌లో ఒక సంచలన ఘటన చోటుచేసుకుంది. తనపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిపై ఓ మహిళ తిరుగుబాటు చేసి తన ధైర్యాన్ని చాటుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పత్రికా విలేకరిగా చెప్పుకునే రవిబాబు పుచ్చకాయల వ్యాపారం నిమిత్తం ఓ ఆటోలో పండ్లను లోడ్ చేసుకుని ఒంటిమిట్టకు వచ్చాడు. ఈ క్రమంలో కూలీ పనికి వచ్చిన ఓ మహిళతో మాటలు కలిపి, ఆటో డ్రైవర్‌తో కలిసి ఆమెను ప్రలోభపెట్టారు. హరిత రిసార్ట్‌లోని రూమ్ నంబర్ 101లో మద్యం సేవించిన అనంతరం, ఆ ఇద్దరూ కలిసి మహిళపై అఘాయిత్యానికి తెగబడ్డారు. రవిబాబు ఆమెను హింసిస్తున్న సమయంలో, ప్రాణరక్షణ కోసం పోరాడిన ఆ మహిళ.. అతని నాలుకను బలంగా కొరికేసింది. నాలుక తెగి పడిపోవడంతో రవిబాబు రక్తపు మడుగులో భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశాడు. వెంటనే ఒంటిమిట్ట పీహెచ్‌సీలో ప్రథమ చికిత్స చేయించుకుని, పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు అతడిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఆటో డ్రైవర్ సదరు మహిళను బెదిరించి రైల్వే స్టేషన్ వద్ద వదిలి వెళ్ళాడు. పవిత్ర పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టలో భక్తులు ఉండే రిసార్ట్‌లో ఇలాంటి దారుణం జరగడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తూ బాధితురాలి కోసం గాలిస్తున్నారు. పరారీలో ఉన్న ఆటో డ్రైవర్ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.