కునో అడవుల్లో చీతాలను వదిలిన సీఎం మోహన్ యాదవ్!
(హైదరాబాద్ న్యూస్‌టైమ్ - నేషనల్ డెస్క్): భారతదేశంలో చీతాల పునరుద్ధరణ లక్ష్యంగా చేపట్టిన 'ప్రాజెక్ట్ చీతా'లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. బోట్స్వానా నుంచి కునో నేషనల్ పార్క్‌కు తీసుకొచ్చిన రెండు చీతాలను సోమవారం బహిరంగ అడవిలోకి విడుదల చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించి, చీతాలను ఎన్ క్లోజర్ల నుంచి స్వేచ్ఛా వనంలోకి వదిలారు. క్వారంటైన్ గడువు ముగియడం, వైద్య పరీక్షల్లో చీతాలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయని తేలడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా చీతాల సంరక్షణలో మధ్యప్రదేశ్ ముందంజలో ఉందని పేర్కొన్నారు. కొత్త పరిసరాలకు ఈ చీతాలు చక్కగా అలవాటు పడ్డాయని, వీటి రాకతో కునో నేషనల్ పార్క్ పర్యాటక రంగం మరింత పుంజుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.