భోపాల్, నవంబర్ 20, 2026 (హైదరాబాద్ న్యూస్టైమ్): భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రాజెక్ట్ చీతా'లో మరో చారిత్రక మైలురాయి నమోదైంది. మధ్యప్రదేశ్లోని కునో జాతీయ ఉద్యానవనంలో బోట్స్వానా నుంచి తీసుకువచ్చిన రెండున్నరేళ్ల వయసున్న 'కెఓఎంజీ 3' (KOMG 3) అనే ఆడ చిరుత శుక్రవారం నాలుగు ఆరోగ్యకరమైన కూనలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అధికారికంగా ప్రకటించారు.
ఈ నాలుగు కొత్త కూనల రాకతో దేశంలో మొత్తం చిరుతల సంఖ్య 62కు చేరుకుంది. వీటిలో 43 చిరుతలు భారత గడ్డపైనే జన్మించడం విశేషం. అటవీ ప్రాంతంలో సహజ సిద్ధంగా ఈ కూనలు జన్మించడం పట్ల పర్యావరణ ప్రేమికులు, అటవీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్ చీతా విజయవంతం కావడానికి అహర్నిశలు శ్రమిస్తున్న ప్రాజెక్ట్ మేనేజర్లు, పశువైద్యులు, క్షేత్రస్థాయి అటవీ సిబ్బంది అంకితభావాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ పరిణామంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్పందిస్తూ, ఇది తమ రాష్ట్రానికే కాకుండా యావత్ దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ చీతా చరిత్రలో ఇదొక గొప్ప విజయమని ఆయన కొనియాడారు.