కూతురు గద్వాల విజయలక్ష్మికి మంత్రి పదవి కోసం ఢిల్లీలో కే.కేశవరావు ముమ్మర లాబీయింగ్
హైదరాబాద్, ఆగస్ట్ 26, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు (కేకే) తన కుమార్తె, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి మంత్రివర్గంలో స్థానం దక్కేలా తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించారు. కొద్దికాలం క్రితం తనతో పాటు కాంగ్రెస్ పార్టీలోకి చేరిన కూతురు విజయలక్ష్మికి కేబినెట్‌లో బెర్త్ ఇప్పించేందుకు ఆయన ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా పావులు కదుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో, ఒకవేళ మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తే ఆ ఖాళీ అయిన స్థానంలో తన కుమార్తెకు అవకాశం కల్పించాలని కేకే అధిష్టానం పెద్దలను కోరుతున్నట్లు సమాచారం. ఈ నియామకం ద్వారా మున్నూరు కాపు సామాజిక వర్గానికి మరియు మహిళా కోటాకు సముచిత స్థానం కల్పించినట్లవుతుందని, పార్టీ బలోపేతానికి ఇది ఉపకరిస్తుందని ఆయన అధిష్టానానికి వివరించినట్లు తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి కండువా మార్చిన కేకే కుటుంబానికి ఇప్పుడు కీలక పదవి దక్కనుందనే ప్రచారం పార్టీలో ప్రాధాన్యత సంతరించుకుంది.