సంస్థాన్ నారాయణపురం, నవంబర్ 11, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేస్తూ, ప్రతి గ్రామంలో బూత్ స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనూరు వీరారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు సుర్వి రాజు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల పదాధికారులు, ఆపై స్థాయి నాయకుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా మండల కమిటీలో బాధ్యతలు స్వీకరించిన పదాధికారులకు నియామక పత్రాలు అందజేసి సన్మానించారు.
ఈ సందర్భంగా దోనూరు వీరారెడ్డి మాట్లాడుతూ.. సంస్థాన్ నారాయణపురం మండలంలో బీజేపీ చాపకింద నీరులా విస్తరిస్తోందని, మండల అధ్యక్షుడు సుర్వి రాజు గౌడ్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతోందని అన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రతి ఒక్కరూ తమ గ్రామాల్లో పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలని సూచించారు. కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా పార్టీ అండగా ఉంటుందనే భరోసా కల్పిస్తూ, వారికి మనోధైర్యాన్ని అందించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 13 ఏళ్లలో దేశంలో అనేక సంస్కరణలు, సంక్షేమ పథకాలను అమలు చేసిందని, వాటి ప్రయోజనాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ వివరించాలని అన్నారు. 2014లో 36 శాతంగా ఉన్న పేదరికం ప్రస్తుతం రెండు శాతానికి చేరిందని పేర్కొంటూ, 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన అగ్రగామి దేశంగా నిలబెట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీని ఎన్నికల్లో నేరుగా ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమిలోని 29 పార్టీలు ఎస్ఐఆర్‌పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఆ ప్రచారాలను వాస్తవాలతో తిప్పికొట్టేందుకు బీజేపీ కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ రెండు సర్పంచ్ స్థానాలను గెలుచుకోవడంతో పాటు వార్డు సభ్యులు, ఉపసర్పంచ్ స్థానాల్లో కూడా విజయాలు సాధించడం శుభపరిణామమని అన్నారు. ఇదే ఉత్సాహంతో రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. బూత్ స్థాయిలో పార్టీని ప్రక్షాళన చేసి, పార్టీ కోసం సమయం కేటాయించే చురుకైన కార్యకర్తలను బూత్ అధ్యక్షులుగా నియమించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బచ్చనబోయిన దేవేందర్ యాదవ్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు దాసోజు వెంకటాచారి, గొల్లూరి యాదగిరి, మండల ప్రధాన కార్యదర్శులు జక్కర్తి బిక్షం, చిలువేరు వెంకటేశం, కోడూరు బీరయ్య, ఉపాధ్యక్షులు బద్దం యాదయ్య గౌడ్, కట్కూరి లక్ష్మీ, వెంకటేష్ గౌడ్, కార్యదర్శులు గూడూరు ఇంద్రసేనారెడ్డి, జక్కర్తి నరసింహ, జర్పుల వినోద్, అంతటి సురేష్ గౌడ్, కార్యాలయ కార్యదర్శి కోగూరి శ్రవణ్ కుమార్, ఉపసర్పంచ్ మెరుగు సైదులు, బీజేవైఎం అధ్యక్షుడు ఉష్కావుల గిరిబాబు గౌడ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు కుకుడాల మహేందర్ రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు నెల్లికంటి శ్రీశైలం యాదవ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు చెరుకుపల్లి రమణమ్మ, దళిత మోర్చా అధ్యక్షుడు అనిల్, చేనేత సెల్ కన్వీనర్ గూడేల్లి బాలరాజు, సోషల్ మీడియా కన్వీనర్ కరంటోత్ రమేష్ నాయక్, చెరుకుపల్లి సత్తయ్య, కందాల నర్సింహ తదితరులు పాల్గొన్నారు.