కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం!

Published on: 16 May 2026, 04:41 AM
News Article
  • పెట్రో ధరల పెంపు ముమ్మాటికీ విశ్వాసఘాతుకం..
  • తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్
  • ఎన్నికలు ముగిసిన పది రోజులకే వంచన..
  • మోదీ అనాలోచిత విధానాలపై ధ్వజం



హైదరాబాద్ న్యూస్ టైమ్, హైదరాబాద్: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమాత్రం సమర్థనీయం కాదని, ఇది సామాన్య ప్రజలను ముమ్మాటికీ వంచించడమేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలు ముగిసిన కేవలం పది రోజుల వ్యవధిలోనే లీటరుకు రూ. 3 పైగా పెంచడం ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధాన్ని సాకుగా చూపిస్తూ ఇంధన ధరలను పెంచే కేంద్రం, మరోవైపు భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎలా చెప్పుకుంటుందని ఆయన ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, యువత ఉపాధికి గ్యారెంటీ లేకుండా పోయిందని ఆరోపించిన సీఎం, ఈ పెట్రో మంటతో నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల నడ్డి విరుస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తూ, పెంచిన ధరలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.