కొండమల్లేపల్లి జెడ్పీ స్కూల్‌లో ప్రమాదం..విద్యార్థికి కరెంట్ షాక్
Published on: 15 Jun 2026, 08:14 AM
హైదరాబాద్ న్యూస్‌టైమ్, కొండమల్లేపల్లి: పాఠశాలలు పునఃప్రారంభమైన వేళ నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగా ఒక విద్యార్థి విద్యుత్ ఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. స్కూల్ పక్కనే ఇల్లు ఉండటంతో సోమవారం ఆడుకోవడానికి వెళ్లిన రామ్ చరణ్ (13) అనే ఎనిమిదో తరగతి ప్రైవేట్ స్కూల్ విద్యార్థిని అక్కడి ప్రభుత్వ ఉపాధ్యాయులు పిలిచి, హైస్కూల్ మెయిన్ గేట్‌కు తోరణాలు కట్టాల్సిందిగా పురమాయించారు. టీచర్లు చెప్పినట్లు బాలుడు గేటు ఎక్కి తోరణాలు కడుతుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలు తగిలి ఒక్కసారిగా కరెంట్ షాక్‌కు గురవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు, దీనితో భయాందోళనకు గురైన ఉపాధ్యాయులు వెంటనే సదరు విద్యార్థిని చికిత్స నిమిత్తం దేవరకొండలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.