కొర్లపహాడ్ గ్రామంలో ఆంబోతు మృతి.. అశ్రునయనాలతో ఘనంగా అంతిమ వీడ్కోలు పలికిన గ్రామస్తులు (video)

Published on: 05 Aug 2026, 01:50 AM

హైదరాబాద్, ఆగస్ట్ 5, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్ - కేతేపల్లి): సాధారణంగా ఒక మనిషి చనిపోతే బంధుమిత్రులు, గ్రామస్తులు ఏకమై అంతిమయాత్రను నిర్వహిస్తారు. కానీ, దేవుడికి వదిలిపెట్టిన ఓ మూగజీవి (ఆంబోతు) మృతికి ఊరంతా కన్నీరుమున్నీరైంది. సాక్షాత్తూ ఆ పరమశివుని నందిగా భావించే ఆంబోతు మృతి చెందడంతో గ్రామస్తులంతా కలిసి హిందూ సంప్రదాయబద్ధంగా బాజా భజంత్రీలతో ఘనంగా అంతిమ వీడ్కోలు పలికారు. ఈ ఉదంతం నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ గ్రామంలో చోటుచేసుకుంది.

  • శివుని నందిగా భావించి పూజలు: గత కొన్ని సంవత్సరాల క్రితం సంప్రదాయ పద్ధతిలో ఓ కుటుంబం దేవుడికి వదిలిపెట్టిన కోడెదూడ.. ఆంబోతుగా ఎదిగి గ్రామ పరిసరాల్లోనే తిరుగుతూ ఉండేది. అందరికీ ఆత్మీయంగా మారిన ఆ మూగజీవి నిన్న సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
  • ఊరంతా కదిలొచ్చి.. ఘనంగా అంతిమయాత్ర: ఆ మూగజీవి మృతికి నివాళిగా గ్రామస్తులంతా ఏకమై అంతిమయాత్రను అత్యంత ఘనంగా నిర్వహించారు. బాజా భజంత్రీలు, డీజే చప్పుళ్లు, మహిళల కోలాటాల మధ్య ఆంబోతు భౌతికకాయాన్ని గ్రామ వీధుల్లో ఊరేగించారు. గ్రామ సర్పంచ్ కొండేటి సైదిరెడ్డి ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలు ఏకమై, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అశ్రునయనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఒక మూగజీవి పట్ల గ్రామస్తులు చూపిన ఈ ప్రేమ, భక్తిభావం అందరినీ కలచివేసింది.